చందు పాలిటెక్నక్ చదువు పూర్తి చేశాడు. చందు వాళ్ళ నాన్న ఊరంతా తిరిగి తల వెంట్రుకలు కొని, వాటిని సవరాలు తయారుచేసే ఫ్యాక్టరీకి ఇచ్చే పని చేస్తుంటాడు. చందు వాళ్ళ అమ్మ పాచి పనికి వెళ్తుంది.
ఆ సంవత్సరం వేసవి కాలం వచ్చింది. కాలేజీ శెలవుల వల్ల చందు ఇంటికి వచ్చాడు. చందు వాళ్ళ అమ్మ పని చేసే ఇంట్లో ‘ వాళ్ళ పిల్లలు వచ్చిన తరువాత పనికి వద్దువులే ’ అని ఓనర్ గారు చెప్పారు. దాంతో చందు వాళ్ళ అమ్మ కూడా ఇంటి దగ్గరే వుంటుంది.
చందు కాలేజ్ చదువు ఎలా జరుగుతుందో ఏమో గానీ, ఇంటి దగ్గర ఇరవై నాలుగు గంటలూ చందు ఫోన్ తోనే వుంటున్నాడు. చందు వాళ్ళ అమ్మ కూడా పని పూర్తయిన తరువాత నుండి టీవీ చూస్తూ వుంటుంది. టీవీ చూస్తున్నా సరే, ఆవిడ ఆలోచన మాత్రం “ ఇల్లు గడవడం కష్టంగా ఉందనే ”. పోనీ చందుని ఏదైనా పనికి పంపుదామంటే “ బరువు పని వాడు చేయలేడు ”. ఏదైనా షాపులో పెడదామంటే... “ వాడు ECET కోచింగ్ తీసుకుంటానని చెప్పాడు ”.
ఆ కోచింగ్ రోజూ సాయంత్రం రెండు గంటలు వుంటుంది.ఏదోలా డబ్బులు చూసి, చందుని ఆ కోచింగ్ కి పంపించింది. చందు ఆ కోచింగ్ కి వెళ్ళే ముందు తన ఫోన్ youtube లో మోటివేషన్ వీడియోలు పెట్టి, వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చి... కోచింగ్ కి వెళ్ళేవాడు. అలా రోజూ గంటసేపు మోటివేషన్ వీడియోలు చూసిన ఆవిడకు ఒక నమ్మకం కలిగింది.
“ ఏదైనా షాపులో పెడదామనే ఆలోచన... ఏదైనా షాప్ పెడదామా అనే ఆలోచనగా మారింది ”.
ఇదే విషయాన్ని వాళ్ళ ఆయనకు చెప్పింది. కానీ, ఆయనకు నమ్మకం లేదు. ఎందుకంటే, అప్పటికే ఆ కాలనీలో పెద్ద కిరాణా షాపులు చాలా వున్నాయి. ఒకవేళ షాపు పెట్టినా, సరుకులు తీసుకు రావడానికి ఆవిడకు ఇబ్బంది అవుతుంది. పెద్దగా చదువుకోకపోవడం వల్ల,డబ్బులు కూడడం కూడా ఆవిడకు సరిగా రాదు.
ఇన్ని చెప్పినా ఆవిడ నమ్మకం కోల్పోలేదు.చందు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యేంత వరకూ సరుకులు తీసుకురావడం, లెక్కలు చూడడం లాంటివి చేస్తాడని నమ్మి... ‘ వాడికి కూడా బాధ్యత నేర్పినట్టు వుంటుంది ’ అన్న ఆలోచనతో... 20000 రూపాయలు అప్పు చేసి, కిరాణా సామాన్లు తెచ్చి, షాపు ఇంట్లోనే పెట్టింది. స్వీట్లు పంచి పెట్టి, అందరికీ షాపు పెట్టామని చెప్పింది.
నిజానికి చందుకి ఆ షాపులో కూర్చోవడం ఏ మాత్రం ఇష్టం లేదు.
ఎందుకంటే “ చందు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి, పాలు పెరుగు ప్యాకెట్ లు తెచ్చి, షాప్ తెరిచి, సరుకులు అన్నీ బయట సర్ది, షాప్ లోనే కూర్చోవాలి.
ఎవరైనా అరువు తీసుకెళ్తే... చందునే గుర్తు పెట్టుకోమంటుంది వాళ్ళ అమ్మ.
సరుకులు తీసుకువచ్చేటప్పుడు, ఎంత తగ్గుతుందో తెలుసుకోవాలి!
ఏ యే సరుకులు అయిపోయాయో చూసుకోవాలి! ‘ సరుకులు చీమలు పట్టకుండా ఎప్పటకప్పుడు చీమలమందు చల్లాలి ’ అని చిన్న పిల్లాడికి చెప్పినట్టు జాగ్రత్తలు చెబుతుంటే... చందుకి కోపం పెరిగిపోతుంది ”.
వీటికి తోడు... ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడికి దీపారాధన చేయాలి.
ఎన్నిసార్లు వాళ్ళ అమ్మకి calculator ఎలా వాడాలో చెప్పినా సరే, వాళ్ళ అమ్మ calculator వాడకుండా తప్పుగా కూడుతుంటే... కోపం వస్తుంది చందుకి.
చందు ఇవన్నీ భరిస్తూనే వున్నాడు. ఆ కోపంలో... దేవుడి ఫోటో ఏదైనా పేపర్లో, కడ్డీల పెట్టె మీద కనబడినా... చెప్పులతో తొక్కేస్తున్నాడు.
అమ్మ calculator వాడకపోవడం వల్ల, ఆ calculator ని బద్దలుకొట్టేశాడు.
పొట్లాలు సరిగ్గా కట్టేవాడు కాదు.
ఉదయం నిద్రలేవడం తోనే తనకు ఇష్టం లేని పని గురించి ఆలోచించడం మొదలు పెట్టి, రాత్రి షాప్ క్లోజ్ చేసేంత వరకూ ఒకటే ఆలోచన ” తన జీవితం ఆ గదిలోనే ఆగిపోతుందేమోనని! ”
ఆ ఆలోచనలో ECET కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళ అమ్మ ఇంట్లో పని అయిపోగానే, షాపులో కూర్చొని, చందుని చదువుకోమని చెప్తే... ఆ టైమ్ లో ఫోన్ వాడేవాడు.
సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ECET లో ర్యాంక్ రాలేదు. ఇక ఈ సంత్సరమంతా తాను షాపులోనే కూర్చోవాలి అన్న ఆలోచన ఆరోజు రాత్రి చందుకి నిద్ర పట్టనివ్వలేదు...
బాధ్యత
Reviewed by Giribabu dola
on
March 28, 2021
Rating:
No comments: