కోపం నీకు మాత్రమే వస్తుంది అనుకుంటున్నావా ?

 




ఆలోచించ లేకపోయినా 
ఆచరించకపోయినా
అవకాశం రాకపోయినా 
అవసరం తీరకపోయినా 
కోప్పడుట నీకు తగునా 

ఏం చేయాలో తోచక పోయినా 
ఎందుకు జరిగిందో తెలియకపోయినా 
ఎవ్వరి మీదైనా , ఏ తరహాలోనైనా 
ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా 
కోప్పడుట నీకు తగునా 

ఊ కొట్టడం ఆలస్యమైనా 
ఊరికినే ఊసులు అడిగినా  
పట్టించుకోకపోయినా 
పదే పదే విసిగించినా
కోప్పడుట నీకు తగునా 

ఉన్నదంతా పోయినా 
లేక అది సరిపోకపోయినా 
సర్దుకో లేకపోయినా 
సరి చూసుకోకపోయినా 
కోప్పడుట నీకు తగునా 

మాట్లాడటం రాకపోయినా 
మాట వినకపోయినా 
చీటికిమాటికి మాట్లాడుకోవడం మానేయడమేనా 

ప్రేమించినా
 ప్రేమించక లేకపోయినా 
తెలుసుకున్నా 
తెలుసుకో లేకున్నా 
అదైనా ఇదైనా ఏదైనా ఏమైనా 
కోప్పడుట నీకు తగునా 

పనిలో ఉన్నా 
పనీ పాటా లేకున్నా 
ఎందుకూ అని అడిగినా 
ఎందుకులే అని వదిలేసినా 
కోప్పడుట నీకు తగునా 

అర్థం చేసుకోలేకపోయినా 
అర్థం అవ్వకపోయినా 
అనుకున్నది జరగకపోయినా 
జరిగేది తెలియకపోయినా 
కోప్పడుట నీకు తగునా 

కలిసి రాకపోయినా 
కలిసి ఉండలేకపోయినా 
ప్రయత్నించడం రాకపోయినా 
ఫలితం ఏమీ లేకపోయినా 
నువ్వైనా నేనైనా నవ్వుకు దూరమేనా 

కష్ట పడకపోయినా 
కష్టం అనిపించినా 
ఇష్టం లేకపోయినా 
ఇష్టం వచ్చినట్టు ఉన్నా 
కోప్పడుట నీకు తగునా 

ఎదిరించినా 
ఎదిగినా 
బతికినా 
చచ్చినా 
బతకలేక చచ్చినా 
కోప్పడుట నీకు తగునా 

సహించినా 
నటించినా 
వేధించినా 
విసిగించినా 
వెక్కిరించినా 
వెధవ వేషాలు వేసినా 
కోప్పడుట నీకు తగునా 

నిజం చెప్పినా 
అబద్దం చెప్పినా 
అబద్ధాన్ని నిజం చేసి చూపినా 
కోప్పడుట నీకు తగునా 

నవ్వించినా 
ఏడిపించినా
నవ్వలేక ఏడ్చినా 
కోప్పడుట నీకు తగునా 

ఏం చేసినా 
అసలు ఏం చేయకపోయినా 
కోప్పడుట నీకు తగునా





కోపం ఆయుధం ! అది అనవసరమైన చోట వాడితే అనర్ధాలే మిగులుతాయి. అన్ని విషయాలకూ యుద్ధమే పరిష్కారమైతే , నవ్వుతో పనేముంది ? మాటకు విలువెక్కడుంటుంది ! సర్లే అని వదిలేయకపోతే నిన్ను మించిన బరువు మోయాల్సి ఉంటుంది . 



కోప్పడిన ఆ నిమిషం అద్భుతమే కానీ, అద్భుతాలన్నీ అందంగా ఉండవు.
కోపంలో పొరపాటున అందంగా ఉంటావేమో గానీ, ఆనందంగా మాత్రం ఉండలేవు. 



ప్రతిదీ అవసరంలో నుంచే పుడుతుంది , కానీ దాని అవసరం ఎంతవరకూ అన్నది ముఖ్యం !
అయినా మనకి అద్దంలో చూసుకోవడానికి time ఉంటుంది కానీ, అర్థం చేసుకోవడానికి మాత్రం time ఉండదు.

అసలు వయసుతో సంబంధం లేకుండా, సందర్భాన్ని అర్థం చేసుకోకుండా, నీకు తెలిసింది మాత్రమే correct అనుకుంటే ఎలా ? ఎందుకీ మనస్పర్ధలు ! ఎంత నీ మనసులో ఖాళీగా ఉంటే మాత్రం వీటికి చోటిస్తావా ?

కోపంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు, కానీ అది అవతలవారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకవేళ సారీ చెప్తే సరిపోతుంది, అంతా సర్దుకుంటుంది అనుకుంటున్నావా ?  నువ్వు చెప్పిన 'సారీ' కి కూడా 'సారీ' అని సమాధానం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది , సారీ అనే మాటకి కూడా అంత విలువ ఉండదని. 

లేదా కోపం నీకు మాత్రమే వస్తుంది అనుకుంటున్నావా ? అది అందరి హక్కు అని మర్చిపోకు !
 బహుశా చిన్నప్పుడు ఆ పది అంకెలు నేర్పింది కోప్పడకుండా ఉండటానికేనేమో ? 
సరేనా !ముందూ వెనుకా నీకు మాత్రమే కాదు ,  ప్రతి విషయానికీ ఉంటాయి .కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలి . అంతా ఆలోచించిన తర్వాత అవసరం ఉంటేనే కోప్పడాలి . 

కోపం సంగతి వదిలేగానీ ,  నువ్వెందుకు అంత సీరియస్ గా చదువుతున్నావ్ ? నీ పెదాలు కదిలించడానికి కూడా నేను పదాలు వాడాలా ??  కొంచెం నవ్వు........ నువ్వు నవ్వితేనే బాగుంటావు...


- giribabu MR.



కోపం నీకు మాత్రమే వస్తుంది అనుకుంటున్నావా ? కోపం నీకు మాత్రమే వస్తుంది అనుకుంటున్నావా ? Reviewed by Giribabu dola on April 26, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.