ప్రియమైన రైతన్నకు.......
హృదయపూర్వక నమస్కారములు !
చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు అన్నారు, అటువంటి చిరునవ్వుకు చిరునామా నువ్వు .
ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకోవడానికి కష్టపడితే ఎవరిదో ఆకలి తీర్చడానికి నువ్వు కష్టపడుతున్నావు .
రాజ్యాన్ని ఏలేవాడు రాజు , అటువంటి రాజులను సైతం ఏలేవాడు రైతు .
ఇష్టంతో కష్టపడితే నష్టమొచ్చినా పెద్ద కష్టమనిపించదని నువ్వు ప్రతిసారీ నిరూపిస్తున్నావు , ఎందుకంటే
" కోట్లు సంపాదిస్తే జీవితాంతం సుఖంగా వుండవచ్చు , అదే ఎదుటివారి కన్నీళ్లు తుడిస్తే జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు " అన్న మాట నీకు మాత్రమే చెల్లింది .
అసలు ఇంతమంది ఆకలికి నీ ఒక్క నాగలి సమాధానం చెబుతుందంటే ఆశ్చర్యమే కదా !
నువ్వు ఓడినా గెలిచినట్టే అన్నా , కానీ మేము ఎంత గెలిచినా నువ్వు ఓడితే మేమూ ఓడినట్టే .
నీ కష్టమే మాకు జీవితం అలాంటి నువ్వు లేకపోతే
' కష్టమే మా యీ జీవితం ' . ఎందుకంటే మా ఆశలకు ఊపిరి నీ ఉనికి . ఇదంతా నాది కాదని నువ్వు వదిలేస్తే , మాదీ అనుకున్న ప్రతీదీ మేం వదిలేయక తప్పదు .
బ్రతకలేక నువ్వు చనిపోతుంటే , నిన్ను చంపుకుంటున్న మేము బ్రతికున్నట్టా ?
ఆకలేసి అడుగుతున్నా , దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అన్నా !
అసలు ఏం జరుగుతుందంటే ,
రైతే ప్రధానం అన్నారు అప్పుడు , రైతుకసలు ప్రాధాన్యమే లేదిప్పుడు .
అదేంటో , అన్నదానం చేసేవాడికి గౌరవమిస్తారు కానీ రైతన్న చేసే దానానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరో తెలియదు . వున్న అన్నం పాడుచేస్తే మళ్ళీ దొరకదు అని బాగానే అన్నారు , మరి వున్న రైతులు పోతే మళ్ళీ కొత్త రైతులు పుడతారనుకుంటున్నారా ?
ఇప్పటికైనా అన్నం పెట్టే దాని గురించి మాత్రమే కాకుండా అన్నం పెట్టే వాడి గురించి కూడా ఆలోచించండి........
- giribabu MR.
అభినందన లేఖ... రైతన్నకు
Reviewed by Giribabu dola
on
November 01, 2019
Rating:
No comments: